పెద్దపల్లికి దూరంగా లోకల్ ఎంపీ

peddhapalli-34567

ఎవరూ ఊహించని విధంగా వెంకటస్వామి తనయుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ పై భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచిన బాల్క సుమన్… ఇప్పుడు పెద్దపల్లికి దూరంగా ఉంటున్నారా ? కొత్తగా ఏర్పాటైన పెద్దపల్లి జిల్లా రాజకీయవర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఒకప్పుడు వారానికి మూడు రోజులకు పైగా పెద్దపల్లిలోనే ఉంటూ వచ్చిన బాల్క సుమన్… పెద్దపల్లి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు వివేక్ టీఆర్ఎస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో పెద్దపల్లికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఒకానొక దశలో పెద్దపల్లిలోని విపక్షాలు తమ ఎంపీ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారంటేనే… ఆయన పెద్దపల్లిని ఎంతగా లైట్ తీసుకుంటున్నారో అర్థమవుతోంది. మరోవైపు బాల్క సుమన్ పెద్దపల్లికి దూరంగా ఉండటం వెనుక కేసీఆర్ ఆదేశాలే కారణమని కొందరు టీఆర్ఎస్ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పెద్దపల్లి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్న వివేక్… ఇప్పటినుంచే మళ్లీ అక్కడ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టాలని భావించారట. ఇదే విషయాన్ని ఆయన కేసీఆర్ కు చెప్పడంతో… బాల్క సుమన్ ను పెద్దపల్లికి దూరంగా ఉండాలని గులాబీ బాస్ సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదాలో ఉన్న మాజీ ఎంపీ వివేక్… పరోక్షంగా పెద్దపల్లి ఎంపీ పాత్రను పోషిస్తున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మరి… వచ్చే ఎన్నికల్లో బాల్క సుమన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *