ఏపీ బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు ?

ఏపీలో ఆయన ఓ పార్టీకి శాసనసభలో ఫ్లోర్ లీడర్. ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్న ఆ పార్టీలో ఆయన ఓ కీలక వ్యక్తి. కానీ.. అలాంటి వ్యక్తి ఈ మధ్య తరచూ అసహనానికి లోనుకావడం సంచలనం సృష్టిస్తోంది. ఆయనే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఆ మధ్య బ్యాంకుల్లో డబ్బులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యానించి బీజేపీ నేతలకే షాక్ ఇచ్చిన విష్ణుకుమార్ రాజుకు ఆ పార్టీ నాయకులు క్లాస్ తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ… తాజాగా ఆయన ఏపీ ప్రభుత్వంపై మరోసారి సంచలన ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అవినీతిలో ఏపీ మొదటి స్థానంలో ఉందని…భూమి అమ్మాలన్నా…కొనాలన్నా లంచం ఇవ్వనిదే పనికావడం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు.

సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో లంచం ఇవ్వకపోతే సీఎంకూ పనికాదని… విశాఖలో అవినీతి అధికారులను ఏసీబీకి పట్టిస్తే…రూ. 10వేల నగదు, ప్రధానితో ఫొటోదిగే అవకాశం కల్పిస్తామని విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రధాని విశాఖ వచ్చినప్పుడు మొదటి 100 మందికి ఈ అవకాశం కల్పిస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించారు. విష్ణుకుమార్ రాజు ఒకేసారి ఇలా వ్యాఖ్యానించడంపై బీజేపీ నేతలే ఆశ్యర్యపోతున్నారు. మరోవైపు టీడీపీ నేతలు ఆయనకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని…ఇందుకోసం టీడీపీ అధిష్టానం అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరి… ఏపీలోని టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కామెంట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే… ముందు ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *