క్రికెట్ పాలిటిక్స్ లోకి అజారుద్దీన్

ఫిక్సింగ్ మచ్చతో క్రికెట్ నుంచి నిష్క్రమించిన టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్… ఆ తరువాత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ తరపున ఎంపీగా పని చేశారు. ఈ సారి కాంగ్రెస్ లోని మిగతా ఎంపీల తరహాలోనే అజారుద్దీన్ కూడా ఓడిపోవడంతో ఆయన ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. అయితే మొన్నీమధ్యే బీసీసీఐలో ఉన్న వ్యాపారవేత్తలకు, బడా బాబులకు సుప్రీం కోర్టు షాక్ ఇవ్వడంతో… బీసీసీఐ చీఫ్ పోస్ట్ దక్కించుకోవడానికి కొందరు క్రికెటర్లు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం క్యాబ్(క్రికెట్ అసోషియేషన్ ఆఫ్ బెంగాల్) అధ్యక్షుడు, టీమిండియా మరో మాజీ కెప్టెన్ గంగూలీ కూడా రేసులో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా హెచ్‌సీఏ(హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) అధ్యక్ష పదవికి మహ్మద్ అజారుద్దీన్ నామినేషన్ దాఖలు చేయడంతో… క్రికెట్ పాలిటిక్స్ లోకి అజారుద్దీన్ కూడా ఎంట్రీ ఇవ్వడానికి ఉవ్విళ్లూరుతున్నాడనే విషయం అర్థమవుతోంది. హెచ్‌సీఏలో ఓటు హక్కు లేకపోయినా పోటీ చేసే అవకాశం ఉందని… లోధా కమిటీ సిఫార్సు మేరకే నామినేషన్ దాఖలు చేశానని అజారుద్దీన్ చెప్పడంతో… ఆయన కూడా బీసీసీఐ అధ్యక్ష పదవిపై కన్నేశాడనే గుసగుసలు జోరందుకున్నాయి. ఈ ఎన్నికల్లో తాను గెలుస్తాననే నమ్మకం ఉందని అజారుద్దీన్ చెప్పడంతో… తెర వెనుక ఆయన కూడా ఇందుకోసం ప్రయత్నాలు చేస్తున్నాడేమో అనే టాక్ వినిపిస్తోంది. మరి పాలిటిక్స్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన అజారుద్దీన్… క్రికెట్ పాలిటిక్స్ లో ప్రభావం చూపిస్తాడేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *